26.5.10

ఈ రోజు మొదటిసారిగా....

తను ఊరు వెళ్ళాలన్నా, నేను వెళ్ళాల్సి వచ్చినా (ఇద్దరమూ కలిసి వెళ్ళేవయితే గొడవే లేదు) ఇన్నాళ్ళూ బస్సులమీదే అధారపడ్డాం. బహుశ ఇంతకు ముందు ఉన్న ఇంటికీ, రైల్వే స్టేషనుకీ చాలా దూరం అనేది ఒక కారణo అయినా... ఇంటి ముందే బైపాస్ రోడ్ ఉండడం మాత్రం ముఖ్య కారణమే.

ఈ మధ్యే మారిన ఈ కొత్త ఇంటి నుంచి రైల్వే స్టేషన్ పావుగంట నడకంత దూరం. అనుకోకుండా ఈ రోజు అతను ఊరెళ్ళాల్సి రావడం...! అదీ నిన్న సాయంత్రమే నిర్ణయమవడం...!

ఈ రోజు మొదటిసారిగా... 'అతన్ని' ట్రైన్ ఎక్కించి వచ్చాను.

ఉదయం ఎనిమిది గంటలకే ట్రెయిన్...
ఏడున్నరకి ఇంటికి తాళం వేస్తుంటే జూబి కంగారు... నన్నొదిలేసి వీళ్ళెక్కడికో వెళ్ళి పోతున్నారనుకుంటూ.

పెద్ద సిటీ కాకపోవడంతో ఇంకా మొదలవని ట్రాఫిక్... మధ్య మధ్య చల్లగానే అయినా బలంగా వీస్తున్న గాలులు... అటూ ఇటూ వెళ్తున్న మనుష్యుల ముఖాల్లోని బద్దకం వీడని నిస్తబ్దత... ఇరువైపులా ఉన్న చెట్ల వల్ల ఆ దారంతా ఆవరించిన నిశ్శబ్దమూ... ఆ చెట్ల నీడలో చెయ్యీ చెయ్యీ పట్టుకుని అతనూ, నేను...!

ట్రైన్ వస్తోందని అనౌన్స్‌మెంట్ వినిపించడంతో త్వరగా వెళ్ళి టికెట్ తీసుకున్నాను. టికెట్ రేటు చూసి నా కళ్ళు తిరిగాయి. ఎక్కువని కాదు... చాలా తక్కువని...! ప్లాట్‌ఫాం మీదకు వచ్చామో లేదో ట్రైన్ కూత... నా చేతిని గట్టిగా పట్టుకుని అతను...

ఉన్నదొక్కటే ప్లాట్‌ఫాం... ఆగేది ఒక్క నిముషం...!

అతను కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పి, ట్రైన్ ఎక్కి నా ముందున్న కిటికీ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. కిటికీ ఊసలకి అటు అతను... ఇటు నేను...


నా మనసుకింకా జీర్ణం కాని వీడ్కోలు..... కళ్ళముందు కనిపిస్తున్న అతన్ని చూస్తూనే ఉంది. కూత శబ్దం మొదలవుతూనే ట్రైన్ బయల్దేరింది. లయగా కదులుతూ మెల్లగా ముందుకు సాగిపోతున్న ట్రైయిన్లోంచి లీలగా అతని చెయ్యి మాత్రం కనిపిస్తోంది.

వీడ్కోలుకి ఆమడదూరంలో ఉంటుందనుకున్న ఎడబాటు అప్పుడే ఎలా వచ్చేసిందో నా దగ్గరకి...!

ఇప్పటివరకూ నిబ్బరంగా ఉన్న గుండెకి ఒక్కసారిగా ఈ నీరసమేంటి...?

2 వ్యాఖ్యలు:

నందు said...

Bhavundhi

Chinni said...

chaalaa baavundi