23.4.12

సాహితీ స్రవంతిలో... తెలుగుకి మెరుగులు...

మన మాతృభాషైన తెలుగు గురించి నేను వ్రాసిన వ్యాసం.. 
"తెలుగుకి మెరుగులు " 
సి.పి.బ్రౌన్ వారి పత్రిక సాహితీ స్రవంతిలో ... ఈ నెల పత్రికలో ప్రచురితమయ్యింది.



అందులో మొదలు కొంచెం...

    రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష.
    మనిషికీ మనిషికీ మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంచేదీ, అవసరాల్ని తెలిపేదీ భాష మాత్రమే. అసలా భాషే లేనప్పుడు భావ ప్రసారానికి తావేది...? మనుషుల మధ్యున్న ఈ భావ ప్రసారంవల్లనే ఇంత నాగరికత, అభివృద్ధి జరిగాయనడంలో సందేహంలేదు. అలాంటి భాషని సంపూర్తిగ తెలుసుకోవడం మన కనీసధర్మం. దాని ప్రాముఖ్యతనే కాదు, ప్రాభవాన్నీ కాపాడుకోవడం మన బాధ్యత.


కాలానుగుణం


   ఒకానొకప్పుడు... రాజరిక వ్యవస్థలున్న కాలంలో కావ్యరచన, సాహితీ వ్యాసంగాలు సంస్కృతంలో గావింపబడినా రానురానూ అవీ వాడుక భాషైన తెలుగులోకి మారాయి ఇప్పుడు.
   క్రీస్తు పూర్వం పరిపాలించిన మౌర్యులు, శాతవాహన రాజుల కాలంలోనే ద్రావిడ లిపి నుంచి పుట్టిన తెలుగు వాడుకలో ఉండేది. అప్పటి శాశనాల ద్వారా ఆ విషయం రూఢిగ తెలుస్తోంది. అయితే "తెలుగు"ని వాడుక భాషగానూ, సాహితీపరంగానూ వాడుతున్నది మాత్రం ఈ ఆధునికయుగము అనగా పంతొమ్మిదవ శతాబ్దము నుంచే.
   నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, కేతన, మారన, పోతన, శ్రీనాథ, (అల్లసాని)పెద్దన, (నంది)తిమ్మన, జక్కన, మల్లన, రామభద్ర, తెనాలి రామకృష్ణ,... ఇలా మరెందరో కవులు ఎన్నెన్నో పద్యాలూ గద్యాలూ అల్లి ఆ అనాది భాషని నశించనివ్వకుండా నిలిపారు.
   రోజులు సంవత్సరాలై శతాబ్దాలు గడిచేకొద్దీ అభివృద్ధి చెందుతున్న మన సంస్కృతీ, నాగరికతల్లాగే మన భాషలోనూ ఎన్నో మార్పులు...!
   సంస్కృతం నుండి గ్రాంధికం వైపు, గ్రాంధికం నుండి స్వచ్ఛమైన తెలుగు వైపు, తెలుగు నుండి వాడుక భాషలోకి... అటునుండి ఇప్పుడు వాడుతున్న ఆధునిక తెలుగువైపు (ఉదాహరణకి: బస్సు, ట్రైన్, పెన్ను, పెన్సిల్, ఫోన్,... మొదలైనవి) మన అడుగులు పడుతున్నాయి. దైనందిన జీవన విధానంలో ముఖ్యపాత్రున్నఈ పదాల్ని తెలుగులో చెప్పలేము, అలాగని ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడలేము.

కొస (చివర) కొంచెం...

   తెలుగు భాష తన వైభవాన్ని కోల్పోతుందని అనుకుంటున్న సమయంలోనే... తెలుగులో వెలువడుతున్న లెక్కలేనన్ని రచనలు, పత్రికలూ; ఈ మధ్యీమధ్యే ప్రపంచ భాషల సరసన తెలుగుకీ లభిస్తున్న గోరంత వెలుగు; తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుంటున్న పిల్లలు; ఇంటర్నెట్ లోనూ తెలుగు వాడకం; ఆన్లైన్లో లభిస్తున్న తెలుగు పత్రికలూ; తెలుగుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్లూ;... ఇవన్నీ చూస్తుంటే... తెలుగు భాష వైభవాన్ని కోల్పోతుందని ఎలా అనగలం...???
   గ్రాంధికం నుంచి తేటతెలుగులోకి పయనిస్తున్నప్పుడు తగ్గని తెలుగు ప్రాభవం ఇప్పుడు తగ్గుతుంది అనడం వాస్తవం కాదు. కానీ వెయ్యేళ్ళుగా తెలుగులో వస్తున్న మార్పులు మలుపులలాగే మరో మలుపు తెలుగు భాషలో మొదలవుతోందనిపిస్తోంది.
   కానీ మనం ఆలోచించాల్సిందల్లా ఒక్కటే...
   ఒక్కో అక్షరాన్నీ ఒక్కో అక్షరాన్నీ చరిత్రలో కలిపేసుకుని వెళ్తూ చివరికి ఎన్ని అక్షరాల్ని మిగుల్చుతామన్నదే మన ముందున్న ప్రశ్న...!!!





telugu - cp brown - sahiti sravanti

18.4.12

హైదరాబాద్‌లోని జాగృతి భవనంలో...

రాత్రి ఏ వేళప్పుడో నిశ్శబ్దంగా...
మల్లెలు విచ్చుకున్నంత మెల్లగా...
మంచు కురిసెళ్ళిపోయినంత మామూలుగా...
జరిగిపోయింది ఆ సమావేశం.

అందరూ తలపండిన పెద్దలే.
ప్రతి పలుకూ వారి అనుభవాల్లోంచి జారినదే.
వారందరి సమక్షంలో చాలా ఆహ్లాదంగా
గడిచింది ఆ సాయంత్రం.

సమాజాన్ని,యువతరాన్ని దిశానిర్దేశనం చేయగల పత్రికల జాబితాలో జాగృతి వారపత్రిక ముందు పేర్కొనదగింది. కమర్షియల్‌గా మాత్రమే ఉంటున్న ఈ రోజుల్లో ఇంత సాంప్రదాయవాదంగా, నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడుండడమే కాకుండా... అదే దైవంగా పనిచేస్తున్న "జాగృతి" పెద్దలకి నా హృదయపూర్వక అభినందనలు.


కీర్తిశేషులు శ్రీ వాకాటి పాండురంగరావుగారి స్మారక కథా పురస్కారాల్లో మొదటి బహుమతి పొందిన నా కథ "సహజీవనం"కి గాను బహుమతి ప్రదానం 08-04-2012 ఆదివారం సాయంత్రం కాచిగూడలోని జాగృతి భవనంలో జరిగింది. ఆ సభకి ముఖ్య అతిథిగా డా. శరత్ జ్యోత్సారాణి గారు వచ్చారు. ఇంకా జి.బి. రెడ్డి గారు, శేషగిరి రావు గారు, హరిహర శర్మ గారు, మునిపల్లె రాజు గారు,... మొదలైన వారు కీ.శే. శ్రీ వాకాటిగారితో తమ తమ అనుభవాల్ని సభికులతో పంచుకున్నారు.

అతిథిగా విచ్చేసిన శ్రీమతి శరత్ జ్యోత్సారాణి గారి వాక్ధాటి అద్భుతంగా ఉంది.

చాలా ఆశ్చర్యం కలిగించిందేంటంటే... మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుండి మేం వచ్చేసే వరకూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూనే ఆ సభలోని వ్యవహారాలన్నీ (పేరుని సార్థకం చేస్తున్నట్టుగా) తానే స్వయంగా చూ(చే)సుకున్న జాగృతి ఎడిటర్ విజయసారధి గారు.అంత వయసులోనూ ఆయనలోని జ్ఞాపకశక్తిని మేం ఇప్పటికీ తల్చుకుంటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా.. అదీ హైదరాబాదులో ఆయన పంచె కట్టు మాత్రమే ధరిస్తారని తెలిసి ఈ రోజుల్లో ఇంకా ఆ ధారణ మిగిలుందా అనిపించింది.


ఇంకా...శ్రీ వాకాటి పాండురంగ రావు గారి అమ్మాయి అపరాజిత గారితో మాట్లాడ్డం...; సేవా భారతి స్థాపించి వైద్య పరంగా ఎందరికో సేవ చేస్తున్న డా.సురేంద్ర రెడ్డిగారు, నీరజా దేవి గారులతో పరిచయం..; అరిపిరాల సువర్ణ గారితో సంభాషణ; ఇంకా... అందరికీ అక్కడే ఏర్పాటు చేసిన భోజనాలు...; అన్నీ కొత్త అనుభూతులే. మొత్తం మీద అది బహుమతి ప్రదాన సభలా కాక.. ఇంట్లోనే జరిగిన వేడుకలా అనిపించింది.


jagruti / vakati / vakaati pandu ranga rao / jaagruthi weekly


21.2.12

మనసులో ఆలోచనలా...? ఆలోచనలే మనసా...??



మొన్న గాడ్పై వెళ్ళిన వేసంగిని..., 


నిన్న జల్లై రాలిన తొలకరిని..., 


ఈ రోజు మోడవుతున్న చెట్టుని..., ... 


అన్నిటినీ ఆస్వాదిస్తాను నేను. ప్రతి రోజూ అలంకరించుకునే కొత్తదనం నాకు ఉత్సాహాన్నిస్తుంది. 


రోజూ వడగాలైతే, ప్రతి నిముషం వానే కురిస్తే, ఎప్పుడూ ఆకులు రాలుతూనే ఉంటే... నాలో ఈ ఆనందం ఉండదు. అందులో సందేహమే లేదు. 


మోడైన ఈ వేపచెట్టు ఎప్పుడు చిగురిస్తుందా అని ఎదురుచూసే నేనే; ముదిరిన సన్నజాజి ఆకుల్ని నిర్దాక్షిణ్యంగా త్రుంచివేస్తాను. 


ఎప్పుడూ ఒకేలా ఉంటే జీవితం నిస్సారమైనట్టు నీరసించిపోతాను కదా... మరి ప్రతీ క్షణం నా చెంతనే ఉండే నిన్నూ, నీ మాటల్నీ... ఎలా, ఎందుకు ఇష్టపడుతున్నాను...? 


అన్ని విషయాల్లోనూ కొత్తదనాన్ని ఆస్వాదించే నేను... నీ విషయంలో మాత్రం విభిన్నంగా ఉన్నానేం...? 


అంటే నాలో... నాకే తెలీని వైరుధ్యమా...! ఏది ఇష్టమో అదే అయిష్టమా...!! 


ఇష్టం, అయిష్టం అన్నవి ఆలోచనలకి సంబంధించినవి. నువ్వు అనేది మనసుకి సంబంధించింది. 


అంటే... ఆలోచనలూ, మనసూ ఒక్కటి కాదా...?



6.2.12

ఒక తారక...


మనమందరం జీవితాన్ని చాలా సాదాసీదాగా గడిపేస్తుంటాం.
చిన్నప్పుడు చదువుల్తోనో; యవ్వనంలో వేరెవరి ఆలోచనల్లోనో; ఆ తర్వాత పెళ్ళీ, బాధ్యతల మధ్యో... మన జీవితంలోని రోజులు మనకే తెలియకుండా మన చేతుల్లోంచి జారిపోతుంటాయి. ఆ జారిపోయే రోజులన్నింట్లోనూ మనం ఆలోచించేదీ, కావాలనుకుని తాపత్రయపడేదీ మన స్వార్థం కోసమే.
కానీ... ఏ మూలో తళుక్కున మెరిసే తారలా అక్కడక్కడ కొన్ని మనస్తత్వాలు... మన ప్రమేయం లేకుండానే మన చూపుల్ని తమవైపు తిప్పుకునేలా చేస్తాయి. సున్నితత్వంతో మనలోపలి ఆలోచనల్ని తట్టి లేపుతాయి.
నిజమే... ఆకర్షించగలిగేది కనులకి కనిపించే అందమే కాదు మనసుని హత్తుకునే సౌందర్యం కూడా..! అందం యొక్క ఆయువు అల్పమైతే... మానసిక సౌందర్యంలోని ఆనందం అనంతమైనది.

అలాంటి సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఓ తారకే సాయిపద్మ.
"శరీరపరమైన అవకరం కంటే అత్యంత జాలిపడాల్సిన విషయం మనసుకుండే అవకరమే.." అనిపించింది నాకు ఆమె గురించి తెలుసుకున్నాక.

సాయిపద్మ చేస్తున్న సామాజిక సేవ గురించి ఆంధ్రభూమి మాసపత్రికలో వచ్చిన వ్యాసం... ఈ క్రింద ఉంది. చదివి మెచ్చితే అభినందించండి. మనసు కరిగితే చేయూతనందించండి.


Tv interviews:

part 1 sakshi salam-

part two sakshi salam

**********************************

Please see the links of HM TV interview below....

Part One:

Part Two:

సామాజిక సేవ చేస్తున్నవారిని గుర్తించి అంకితభావంతో నలుగురికీ తెలుపుతున్న శ్రీదేవీ మురళీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.






sai padma - Ability In Disability - AID

4.2.12

హలో... అవాక్కయ్యారా...!!!

హలో... అవాక్కయ్యారా...!!!


నచ్చీ నచ్చనట్టున్నా... మార్చక తప్పని పరిస్థితిలో మార్చిన నా బ్లాగు అలంకరణ ఇది.

పాతింటికే (కొత్త కొత్త) రంగులేసినట్టుందా...



15.12.11

ఈ నెల విపులలో నా కవిత...

ఈ నెల "విపుల" ముషాయిరాలో నా కవిత... జీవిత సత్యం ప్రచురితమైంది.

దాని లింక్ ఈ పక్కన...
"జీవిత సత్యం"



25.11.11

రంజని... కథల పోటీల బహుమతి ప్రధానోత్సవం

రంజని... తెలుగు సాహితీ సమితి వారు నిర్వహించిన రెండు కథల పోటీలలో బహుమతులు పొందిన రచయిత(త్రు)లకు ఈ నెల వ తేదీన "రవీంద్రభారతి"లో బహుమతి ప్రధానోత్సవం చేశారు.

ఆ వివరాలు రంజని వారి బ్లాగులో... ఇక్కడ




14.11.11

జాగృతి బహుమతి కథ...

సహజీవనం
నల్లగా ఉన్న రాతిరి మలి ఘడియలు చాలా చల్లగా ఉన్నాయి.
నా చుట్టూ... బోలెడు చెట్లు, వాటి బలాన్ని చాటే కోటానుకోట్ల ఆకులు, కొమ్మలూ; కొమ్మల మధ్య చిన్న చిన్న పక్షుల గూళ్ళు... నా చుట్టూ ఇంత జీవమున్నా ఏ అలికిడీ లేదు వాతావరణంలో. మరీ పట్టిపట్టి చూస్తుంటే తెలుస్తోంది మంచు కురవడం. ఆకుల మీద పడిన మంచు బిందువులన్నీ ఏకమై ఉండుండీ చినుకులుగా కురుస్తున్నాయి. అయినా నిశ్శబ్దమే నా చుట్టూ... ప్రశాంతత నిండిన నిశ్శబ్దం..!
అలవాటైన ప్రకృతే... అయినా పరవశిస్తూ వాకిలి ఊడ్చే పనిలో పడ్డాను.
నిండైన ముగ్గు ముగించే వేళకి వేకువ మొదలైంది... కువకువలతో.
ముగ్గు గిన్నెతో లోపలికి వస్తుంటే పక్కింటి గేటు శబ్దమైంది. అప్రయత్నంగా నా తల అటు తిరిగింది. ఇన్ని రోజులుగా చూస్తున్నా... పక్కింటి మామ్మగారు ఉదయాన్నే వచ్చి ముగ్గునీ, ముగ్గు వేస్తున్న నన్నూ మార్చిమార్చి చూస్తోంది ప్రతిరోజూ.
నేను ఓరగా ఆవిడని చూస్తే... ఆ ముసలావిడ వింతగా ముగ్గు వంకే చూస్తూ...!
* * *
నాన్నకి ప్రమోషన్‌తో పాటూ ట్రాన్స్‌ఫర్ రావడంతో మేము ఈ మధ్యనే ఈ ఊరికొచ్చాం.
అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఒక చెల్లి, తమ్ముడు. నాకు ఊహతెలిసే వరకూ నాన్నే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. హైస్కూలుకొచ్చాక పెద్ద కూతురుగా ఆ బాధ్యతని నేను తీసుకున్నాను. మొన్నే బికాం ఫస్ట్ క్లాసులో పాసై, పిజికి అప్లికేషన్ పెడదామనుకునేంతలో ఈ ట్రాన్స్‌ఫర్..! చెల్లి డిగ్రీ రెండో సంవత్సరం, తమ్ముడేమో ఇంటరూ. వాళ్ళిద్దరి చదువుల గురించే ఇబ్బందిప్పుడు. ఇక్కడ్నుంచి రెండు బస్సులు మారి, రెండు గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి కాలేజీకి. వాళ్ళకోసమే నేనింత ప్రొద్దుటే లేచి వంట, క్యారేజీల పనిచూడ్డం.
* * *
ఓ రోజు పక్కింటి మామ్మగారు "అమ్మా.. మధురిమా.." అంటూ వచ్చారు.. పెద్ద పళ్ళెంలో పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు... అన్నీ నిండుగా పెట్టి తీసుకొచ్చి.
'ఏంటండీ విశేషం..' అంటే 'ఈ రోజు తమ పెళ్ళి రోజ'న్నారు.
"ఇది ఎన్నో పెళ్ళి రోజు..?" అనడిగాను ఆవిడని కూర్చోమని కుర్చీ చూపిస్తూ.
"స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్ళో మా పెళ్ళయ్యి అన్నేళ్ళు" అందావిడ నవ్వుతూ.
తర్వాత ఆవిడే అంది... "తెల్లదొరల నుంచి స్వాతంత్ర్యం వచ్చేవరకూ నిన్ను పెళ్ళిచేసుకునేది లేదు.. అని తాంబూలాలైన పెళ్ళిని నాలుగేళ్ళు వాయిదా వేశారు మీ తాతయ్యగారు." అంది సగం నవ్వుని దాచుకుంటూ. అందులోని సిగ్గు అస్పష్టంగా కనిపించింది. "ఆ నాలుగేళ్ళూ ఆయన నాకూ, వాళ్ళవాళ్ళకి దూరంగా.. స్వాతంత్ర్య పోరాటం సల్పే ఇతర యువకుల రహస్య స్థావరాల్లోనే. ఎంత పట్టుదలనుకున్నావ్ మీ తాతయ్యగారిదీ..! ఇరువైపుల వాళ్ళనీ ఒప్పించడం ఒకెత్తయితే నన్నొప్పించడం ఒకెత్తు అంటారిప్పటికీ.." మళ్ళీ ఆవిడ బుగ్గల్లో సిగ్గులు.
ఆ రోజు నుంచి ఆవిడతో నా పరిచయం చూపులు, చిరునవ్వుల్ని దాటి మాటల వరకూ సాగింది. ఆవిడ పేరు అనంత లక్ష్మి. అందరూ అనంతా, అనంతమ్మగారు అంటారు. అనంతమ్మగారు మనసుల్ని చదవగల నేర్పరే కాదు మనసెరిగి నడుచుకునే ఇల్లాలూనూ. ఆవిడకి ముగ్గులంటే చాలా ఇష్టమట. 'ఈ రోజుల్లో ఆడపిల్లలకి ముగ్గులెయ్యడమే రాదు..' అంటూ నేను వేసే ముగ్గుల్ని మెచ్చుకునేది.
నాకూ వచ్చేది కాదేమో.. మా అమ్మ బతికుంటే.
* * *
మామ్మగారికి నే వేసిన ముగ్గుల్ని గమనించడం ఎలా అలవాటయ్యిందో అలాగే నాకూ ఆవిడ దినచర్యని పరిశీలించడం అలవాటయ్యింది. ఎనభై పైనే ఉంటుంది మామ్మగారి వయసు. ఆవిడ చేసే పనుల్లో.. నిదానమే తప్ప నీరసం ఎప్పుడూ కనిపించేది కాదు.
ఉదయాన్నే లేచి ఇల్లూవాకిళ్ళూ శుభ్రం చెయ్యడం, అప్పుడప్పుడూ తాతగారికి(భర్తకి) నలుగుతో స్నానం చేయించడం, ఆనక భోజనాలయ్యాక దంపతులిద్దరూ విశ్రాంతిగా వరండాలో కూర్చోవడం, సాయంత్రవేళల్లో తోటపనీ, కాసిన ఫలాల్ని, పూసిన పువ్వుల్నీ.. అందరికీ పంచడం, చల్లని రాత్రుల్లో ఆరుబయట అరుగుమీద ఆయనకి కాళ్ళు నొక్కుతూనో... విసనకర్రతో విసురుతూనో... ఇదీ ఆవిడ దినచర్య. ఏ హడావుడీ, ఆడంబరం లేకుండా ఎంత ప్రశాంతంగా గడిచిపోతుందో ప్రతిరోజూ.
నేనిప్పటివరకూ చూడని ఓ పూలచెట్టుని మొన్న వాళ్ళింటికెళ్ళినప్పుడు చూశాను. అవేం పూలని అడిగితే మధుమాలతీలని చెప్పింది మామ్మ. ఎంత బాగుందో వాటి వాసన.
* * *
ఒకరోజు మధ్యాహ్నం... వస్తున్నట్టు ఫోనైనా చెయ్యకుండా మా మేనత్త పద్మ వచ్చింది.
సాయంత్రం నాన్న వచ్చేవరకూ నాతో అన్నివిషయాలూ మాట్లాడి, తన కూతురు సునయన గురించి చెప్పింది విన్నాక సునయన మీద చాలా కోపమొచ్చింది నాకు. ఆడపిల్లై ఉండీ, ఇంత చదివీ ఇలా ప్రవర్తించిందా.. అని ఆశ్చర్యమేసింది. ఈ విషయం గురించే నాన్నతో మాట్లాడదామని వచ్చిందేమో అనుకున్నా. తీరా నాన్న వచ్చాక తనకూతురిగురించి చెప్తూనే అసలు సంగతి బయటపెట్టింది పద్మత్త.
"నా కూతురేం చేసిందో చూశావుగా. వీళ్ళు తల్లిలేని పిల్లలు. వీళ్ళ ఆలోచనలు తెలుసుకోవడానికి వదినా లేదు. అసలే రోజులు బాలేవు. నేను చెప్పిన సంబంధం అయితే నీ కూతురు సుఖపడుద్ది. చెయ్యొచ్చులే అని ఆలశ్యం చేస్తే రేప్పొద్దున్న నీ కూతుర్లేం చేస్తారో..." వివరాలన్నీ చెప్పి ముక్తాయింపు నాలుగు ముక్కల్లో ముగించింది అత్తయ్య.
నాన్న ఆలోచనలో పడ్డారు.
ఇన్నాళ్ళూ మాలో ఎవరికీ లేని ఆలోచనలు... చివరికి నాక్కూడా..! నిజమే.. నాన్నకూడా మమ్మల్ని 'ఇంకా ఏం చదివించాలి' అనే తప్ప ఎప్పుడూ మా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ అత్తయ్య అన్న చివరిమాటలే నన్ను అమితంగా బాధించాయి.
తన కూతురేదో చెయ్యరాని పని చేస్తే తామూ అదే దారిలో అడుగేస్తామనడం ఏం న్యాయం...!
* * *
అత్తయ్య వెళ్ళే రోజు.. సునయన సెల్ నెంబరడిగితే, "దానితో మాట్లాడుగానీ దాని బుద్ధులు బుర్రకెక్కించుకోకే తల్లీ." అంటూ నెంబర్ చెప్పింది అత్తయ్య.
అత్తయ్య వెళ్ళిన సాయంత్రమే సునాకి ఫోన్ చేశాను.
కుశల ప్రశ్నలయ్యాక "అత్తయ్య వచ్చింది నిన్న.." అన్నాను.
"అయితే మీకూ చెప్పేసిందన్న మాట.." అందది నిర్లిప్తంగా.
"ఏం చెప్పిందనుకుంటున్నావ్..." ఏమీ తెలీనట్టే అడిగాను.
"కొత్త విషయాలింకేమున్నాయ్ చెప్పడానికి. నేనిక్కడ ఎవరితోనో కలిసుంటున్నానన్నది తప్ప.." ఠకీమని చాలా మామూలుగా అంది సునయన.
'అది నిజమేనా' అని నోటిచివరిదాకా వచ్చిన ప్రశ్నని సునా దూకుడు చూసి బలవంతాన దిగమింగుకుని, "నాకో పెళ్ళి సంబంధం తెచ్చింది." అని సంభాషణ అటువైపు మళ్ళించాను.
"నాకైపోయినియ్. ఇక నీకు మొదలుపెట్టిందా..!" వ్యంగంగా అంది.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు.
"చూడు మధూ. మా అమ్మ గురించి నీకు తెలుసుగా. తను డబ్బునే చూస్తుంది తప్ప.. వాళ్ళెలాంటి వాళ్ళో పట్టించుకోదు. డబ్బుంటే చాలు, గొప్పవాళ్ళంటుంది. తను తెచ్చిన సంబంధం ఏదీ నువ్వు ఓకే అనకు. నాకూ ఎన్నో మాచెస్ చూసింది. అవేవీ నాకు నచ్చలేదు. నేను ఉదయ్ అనే అతన్ని ప్రేమించాను అని చెప్పాను. ఛస్తే ఒప్పుకోనంది. ఉన్నొక్క కూతురూ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేస్తూ నెలా నెలా సంపాదనని పంపిస్తోంది, దానికి నచ్చినది చేద్దాం అని ఉండాలా.. వద్దా. ఇక్కడ నేను ఎలా ఉన్నానో ఏంటో అవసర్లేదు. ఆవిడ లోకమంతా డబ్బే మధురిమా. నేను ఉదయ్‌ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అమ్మకి. తనొప్పుకునే వరకూ ఆగాల్సిన అవసరం నాకు లేదు. అలాగని అందర్నీ ఎదిరించి పెళ్ళి చేసుకోవడమూ ఇష్టం లేదు. అందుకే బాగా ఆలోచించాకే మా పరిస్థితుల్నిబట్టి నేను, ఉదయ్ సహజీవనం చేస్తున్నాం. నా మాటలు నీకు తప్పుగా అనిపిస్తున్నా... నేను చేస్తోంది కరెక్టేనని నా మనసు చెప్తోంది. నా జీవితం నా ఇష్టం. అవునా... కాదా.. మధూ..."
సునా చెప్పింది విన్నాక నోట మాట రాలేదు నాకు. ఫోన్ పెట్టేశాక కూడా సునా ఆలోచనలు వీడలేదు నన్ను.
పెళ్ళి చేసుకోకుండా ఒక ఆడ, మగ కలిసి ఉండవచ్చా..!?
* * *
సునాతో మాట్లాడి వారం రోజులైనా అన్యమనస్కంగా ఉంటున్నానని నాకే అర్థం అవుతోంది. ఇక అనంతమామ్మ గ్రహించడంలో వింతేముంది. అక్షరాల్ని చదవగలగడం తప్ప మరే పెద్ద చదువులూ చదవని ఆవిడలో అంత జ్ఞానం అనుభవాలిచ్చిన సొత్తేమో..!
నే చెప్పిందంతా విన్నాక ఎప్పటిలానే చిరునవ్వు నవ్వి, "కలిసి ఉండడం తప్పేం కాదే." అంది. "ఒక వేళ తప్పనుకున్నా.. తప్పు చేసింది ఎవరో అయితే నువ్వెందుకు చింతించడం..?" అంది సూటిగా.
'నిజమే కదా.. నాకెందుకింత మధన..?' అనుకోకుండా ఉండలేకపోయాను విస్మయంగా.
"సహజీవనం తప్పుకాదు మధురిమా. ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ఒకరికొకరు తోడుగ బ్రతకాలనుకుంటే సహజీవనం తప్పుకాదు. అవసరం కోసమో, ప్రతిఫలం కోసమో కలిసే బంధం కలకాలం నిలవదు. ఆ లబ్ది పొందేసినప్పుడు బంధంలోని అందం, అనుబంధమూ మాయమైపోయి, మళ్ళీ ఎవరి పాత బ్రతుకులు వారికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి."
"అంటే..."
"అంటే ఏముంది.. మొదటికలయికల్లోని ఆకర్షణ తగ్గాక పట్టిఉంచే బంధం ఏదీ లేదుకాబట్టి ఎవరికివారే అని విడిపోతారు. వాళ్ళుకోల్పోయేది బంధాన్నే కాదు సున్నితత్వాన్ని కూడా. అదే మన సమాజం ఏర్పరిచిన పెళ్ళనే బంధంలో 'నేను' నుంచి 'మనం' అనే దగ్గరతనం ఉంటుంది. ఆ దగ్గరతనంవల్లే ఒకరితప్పుల్ని ఒకరం అర్థంచేసుకుంటాం. మనసుకి బంధం ఉండాలి కాబట్టి పెళ్ళి తప్పనిసరి. కానీ ఆ పెళ్ళి బంధనం అవకూడదు."
అర్థమయ్యీ కానట్టుంటే అప్రయత్నంగానే తలూపాను. నాలోని సందేహాల్ని ఆవిడ విపులంగా చెప్పినా, అవునో కాదో తరచి చూసుకోవలసింది మాత్రం నేనే.
మామ్మ నాతో ఇంత ఎక్కువగా ఇన్ని విషయాలు మాట్లాడుతుంది.. మరి ఎప్పుడు చూసినా తాతయ్యతో అసలు మాట్లాడినట్టే కనిపించదేంటీ..! ఇద్దరూ ఆ అరుగుమీద కూర్చుంటారు. అలా నిశ్శబ్దంగా... అంతే. వాళ్ళ భాష 'మౌనమే'మో...!
మేం ఇక్కడకొచ్చి అప్పుడే మూడేళ్ళయిపోయింది.
ఇక్కడికొచ్చాక అనంతమామ్మగార్నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పుస్తకాల్లో వ్రాయని, తరగతి గదుల్లో చెప్పని ఎన్నెన్నో విషయాలు..! సమాజపు కట్టుబాట్లు, పద్దతులు, మనిషిని అంచనా వేసుకునే విధానం, నైతిక, మానవత్వ విలువలు,.. మరెన్నో.
* * *
నాన్న స్నేహితుని ద్వారా కుదిరిన సంబంధం.. ఈ ఏడే.. మొన్న శ్రావణంలో ప్రశాంత్‌తో పెళ్ళైంది నాకు. ఇల్లు చక్కబెట్టే బాధ్యతంతా చెల్లి తీసుకుంది.
ఇప్పుడు దీపావళి పండగని... 'ఆయన' పండుగనాడు నాన్నాళ్ళింటికి వస్తానని చెప్పడంతో, నాన్న నాలుగు రోజుల ముందే నన్ను అత్తగారింటినుంచి తీసుకొచ్చారు.
రాగానే అనంతమ్మగారడిగారు 'కాపురం ఎలా ఉంద'ని. 'ప్రేమగా చూసుకునే భర్త, కలివిడిగా ఉండే అత్తగారూ.. అందమైన జీవితం..' చెప్పాను.
ఎందుకో మామ్మలో ముదుసలితనం స్పష్టంగా కనిపిస్తోంది. వార్థక్యంలో.. ఇలాగే ఉంటుందా..!
* * *
సునాకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారట. తను, ఉదయ్ విడిపోయి సంవత్సరమైందని చెల్లి చెప్పింది. సునాకి ఫోన్‌చేసి మాట్లాడాను. తన మాటల్లో ఏ మార్పూలేదు. అదే స్థిరత్వం.
"కారణాలు ఏవైనా అంత న్యారో మైండెడ్ మెంటాల్టీ ఉన్నవాడితో నేను కలిసుండలేను. ఇక పెళ్ళంటావా.. మగవాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవట్లేదా.. ఎంతమందితోనైనా తిరగట్లేదా..? ఆడవాళ్ళకేం తక్కువ..? ఉద్యోగాలు చేసి, ఇంటా బయటా పనులు చెయ్యగలవాళ్ళం. మనమెందుకు తగ్గుండాలి..?" తన మాటల్లో కొత్తగా వచ్చిన ఆవేశం. అందులో సున్నితత్వం లేకపోవడం స్పష్టంగా కన్పించింది నాకు.. అచ్చం మామ్మ చెప్పినట్టే.
ఆ సాయంత్రం.. అనంతమ్మగారింటి వరండాలో మధుమాలతీల్ని మాలకడుతూ.. అడిగాను "పెనవేసుకున్న బంధం ఎప్పటికైనా విడిపోవల్సిందేనా..?" అని.
నా కళ్ళలోతుల్లోకి చూసింది మామ్మ. ఆ చూపుల్లో మాలతీల వాసనలంత గాఢత..!
మళ్ళీ అడిగాను... "భౌతిక సుఖం కోసమో, మానసిక అవసరం కోసమో.. కలిసుండే జంటలు కారణం కనుమరుగవ్వగానే విడిపోతున్నాయి. భౌతికంగా దూరమవలేని కొందరు కలిసుంటున్నా దానికీ మరేదో కారణం.. తాళి బంధమో, పేగుబంధమో,..! అంటే కలిసుండే రెండు జీవితాలు ఎప్పటికైనా భౌతికంగానో, మానసికంగానో ఒంటరిగా బతకాల్సిందేనా.."
ఎప్పట్లానే మామ్మ చిరునవ్వు నవ్వింది సమాధానమేం చెప్పకుండా. పువ్వులు మాలకట్టడం అయిపోవస్తున్నా మౌనంగానే ఉందామె.
చివరిముడి అయ్యాక నోటితో దారాన్ని తెంచుతుంటే.. "కొన్నిటికి సమాధానాలు మనం అనుభూతించి నేర్చుకోవాలి. మరికొన్నిటికి ఎదుటివాళ్ళ అనుభవాల్నించి తెలుసుకోవాలి. ఇంకొన్ని ప్రశ్నలకి జవాబుని శోధించి కనుక్కోవాలే మనవరాలా" అంది మామ్మ నాప్రశ్నకి జవాబివ్వకుండా.
"నీకోసం.. మొన్న తొలకరుల్లో మధుమాలతీ తీగ అంటు తొక్కుంచాను. వేర్లొచ్చాక మీ తాతయ్య తీసి అదుగో ఆ కుండీలో వేశారు. ఇంటికి వెళ్ళేప్పుడు తీసుకెళ్దువుగాని." మురిపెంగా మాలతీలతవంక చూపిస్తూ చెప్పింది. అంతలోనే నేనేదో అనేలోపు బజారుకెళ్ళిన తాతయ్య లోనకొస్తుండడంతో ఎదురెళ్ళింది. ఈ వయసులోనూ వాళ్ళ అనురాగం అబ్బురంగా అనిపిస్తుంటే వారిని చూస్తుండిపోయాను. నాకూ 'అనంతమ్మగారిలాంటి అమ్మో.. మామ్మో.. ఉంటే..' అనిపించింది మొదటిసారిగా.
* * *
పొద్దుపూవు తొలివెలుగురేఖల్నైనా విడువక మునుపే గట్టిగట్టిగా వినిపిస్తున్న మాటలకి అధాటున లేచి కూర్చున్నాను. "అక్కా త్వరగా రా.." అంది చెల్లి నా మంచందగ్గరకొస్తూ.
కలతనిదురతో బరువెక్కిన కనురెప్పల్ని బలవంతంగా విడదీసి.. "ఏం.." అంటూ మంచం దిగాను.
"త్వరగా రా.." చెప్తూనే కంగారుగా ముందుకు నడిచింది.
నిద్రమొహంతోటే దానివెనక మామ్మాళ్ళింటికి వెళ్ళాను. ఎదురుగ గుంపుగా కొందరు.., నాన్నాఅక్కడే ఉన్నారు.
మామ్మ.. మామ్మకేమన్నా...! ఊహించలేకపోయానిక.
మనుషుల్ని తప్పుకుని వెళ్ళేసరికి అక్కడ వరండాలో...
తాతయ్య శరీరం.. నేలమీద పడుకోబెట్టి...! ప్రక్కనే మామ్మ... తాతయ్య వంకే అపనమ్మకంగా చూస్తూ...!!
తాతయ్య నిర్జీవంగా... మామ్మ జీవశ్చవంలా...
గుండె పట్టేసినట్టై కళ్ళవెంట గిర్రున నీరు తిరిగింది. మామ్మని ఏమని ఓదార్చాలి...? మాటలురాక తాతయ్య కాళ్ళదగ్గర కూలబడ్డాను. ఒక్కసారిగా ఉబికింది వెల్లువైన దుఃఖం. నాకే ఇలా ఉంటే.. మరి మామ్మకి..? నన్ను నేను తమాయించుకుంటూ.. మామ్మవైపు చూశాను.
ఆమె ఈ లోకంలో ఉన్నట్లు లేదు.. నేను రావడమూ తెలీనట్టే ఉంది. ఈ ప్రపంచంలో తాతయ్య ముఖం తప్ప మరేమీ లేనట్టుగ తాతయ్య ముఖంలోకే చూస్తోంది.
నా భుజం తట్టిలేపారు నాన్న. మామ్మాళ్ళ పిల్లలకి ఫోన్లు చేస్తే 'దేశంకానిదేశంలో ఉన్నాం.. రావడానికి ఇప్పుడప్పుడే అవదని' చాలా నిర్లిప్తంగా చెప్పడంతో నాన్నే జరగవలసినదంతా దగ్గరుండి చేశారు.
ఆ రాత్రి మామ్మకి తోడుండమన్నారు నన్ను. కానీ మామ్మకి నేను ప్రక్కనున్నానన్న స్పృహేలేదు. ఏదన్నా మాట్లాడబోయినా నా కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోతోంది.
* * *
మర్నాడు తెల్లవారుఝామునే లేచి చూస్తే ప్రక్కన మామ్మ లేదు. నిశ్శబ్దాన్ని చీల్చుతూ నా పిలుపు. కంగారుగా మూడుగదులూ తిరిగి చూశాను. నా పిలుపు అరుపైంది అప్పటికే.
వరండాలోకొచ్చి చూస్తే_
అక్కడ... ఎప్పుడూ తాతయ్య, మామ్మ కూర్చునే అరుగు మీద పడుకుని మామ్మ...!
ఎందుకో.. ఇంకా చీకట్లు ముసిరే ఉన్న ఆ నిశ్శబ్దంలో ఏదో భయం..!
"మామ్మా.." గట్టిగా పిలుస్తూ మామ్మని కుదిపాను.
అచేతనంగా వాలిన మామ్మ మేనంతా మంచుబిందువుల తడి చల్లగా...! "మామ్మా.." బిగ్గరగా రోదిస్తున్న నాలో... ఆత్మీయబంధం దూరమైందన్న వేదన..
ఎంతసేపైందో... నా భుజాలమీద బలమైన చేతుల పట్టు... తలతిప్పి చూస్తే...
ప్రశాంత్.. 'మౌనం'తోనే నన్నోదార్చుతూ...!!
మామ్మ (చెప్పని) వెతుక్కోమని చెప్పిన సహజీవనానికి అర్థం... ఏ మూలో లీలగా తెలుస్తున్నట్టుగా...

* అయిపోయింది *

27.10.11

జాగృతి వారపత్రికలో మొదటి బహుమతి పొందిన నా కథ...

జాగృతి వారపత్రికలో దీపావళి సందర్భంగా నిర్వహించిన వాకాటి పాండురంగరావుగారి స్మారక కథాపురస్కారం కథలపోటీలో నేను వ్రాసిన కథ సహజీవనం... మొదటి బహుమతి పొందింది.

ప్రస్తుతం ఆ సంచిక మార్కెట్లో ఉంది. మొదటి బహుమతి పొందిన కథతో పాటూ ప్రత్యేక బహుమతి పొందిన మరో నాలుగు కథలూ ఈ సంచికలో ప్రచురితమయ్యాయి. ఇవికాక కవితలూ... వ్యాసాలూ... మరెన్నో... ఈ దీపావళి ప్రత్యేక సంచికలో...


ఆ సంచిక ముఖచిత్రం..

16.10.11

ఆంధ్ర భూమి అనుబంధంలో నా కథ...

అక్టోబర్ 9 న ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ అమ్మతనం




అమ్మతనం

’బాల్కనీలో కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ, ఆ పరవశాన్ని అరమోడ్పు కళ్ళలో దాచి అందమైన సాయంత్రాన్ని అనుభూతించక ఎన్నాళ్ళైంది...! అయినా మనసటు లాగదేం...?
మొన్న హాస్పిటల్ నుంచి వస్తూ కొని తెచ్చిన గులాబి మొక్కని శాంత సరిగా నాటిందో లేదో... గులాబి మొక్క వేరు ఇక్కడి మట్టిలో ఇమిడి చిగురేసిందో లేదో... అని చూద్దామనుకుంటూనే నాలుగు రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నా మొక్కవైపు కూడా చూడట్లేదెందుకు...?
కనీసం ఈ రోజు వచ్చిన BMJ (బ్రిటిష్ మెడికల్ జర్నల్)నైనా తిరగెయ్యాలనిపించట్లేదేంటి...?
ఏదో నిరాసక్తత...!
ఇన్నాళ్ళూ... ఇన్నేళ్ళూ ఏదైతే జరగదని అనుకున్నానో..., జరక్కూడదని కోరుకున్నానో..., జరిగే అవకాశం లేదని సంతోషపడ్డానో..., ఇప్పుడు... అదే జరగబోతోందని తెలిసినందుకా... ఈ నిర్లిప్తత...!
అసలు వీరిద్దరి అభిప్రాయాలూ ఎలా కలిశాయి...? ఎక్కడ కలిశాయి..?
స్రవంతి, రుధిర్‌లు ప్రేమించుకుంటున్నారా...! ఇదెలా సాధ్యం...?
వీడుండేది ఇక్కడ. స్రవంతి ఉండేది చెన్నైలో. మరి వీరి మధ్య మాటలు కలిసిందెప్పుడు...? వీళ్ళు ప్రేమించుకోవడం మొదలు పెట్టిందెప్పుడు...? అదీ నాకు తెలీకుండా...! ఈ విషయం స్రవంతి వాళ్ళ అమ్మానాన్నలకి తెలుసా..? తెలిస్తే ఒప్పుకుంటారా...? వాళ్ళ వరకూ ఎందుకు... ఈయన, నేను...? రుధిర్ ఈ విషయాన్ని ప్రత్యేకించి నాకు చెప్పడంలో వాడి ఉద్దేశ్యం ఏంటి...? ఈయనకి నేను చెప్పి ఒప్పించాలనా..? వాళ్ళందరి సంగతీ తర్వాత ముందు ఈ పెళ్ళి నాకు ఇష్టమేనా...?
ఇన్నేళ్ళు నేను అనుకున్నదేంటి... ఇప్పుడు రుధిర్ ఇష్టపడ్డాడని స్రవంతితో పెళ్ళి చేసేస్తానా...! ఇంత తెలిసీ ఎలా పెళ్ళి చేస్తాను వాళ్ళిద్దరికీ..’
ప్రముఖ ప్రయివేట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్‌‍గా పనిచేసే సుమనకి చాలా రోజుల తర్వాత దొరికిన తీరిక సమయమది... అందులోనూ ఆమెకెంతో నచ్చే ఆహ్లాదకర సాయంత్రం... కానీ ఆమె మనసులో... దేన్నీ ఆస్వాదించలేనంత అలజడి.
అది ఆమెకీ అర్థమవుతోంది. అందుకే ఆమెలోని ఆలోచనలిలా...
* * *
"గుడీవినింగ్ రుధీ. హౌ ఆర్యూ...?" అతని కాల్ చూస్తూనే ఉరకలేస్తున్న ఉత్సాహంతో హుషారుగా అడిగింది స్రవంతి.
"ఫైన్. మామయ్య, అత్తయ్య ఏమంటున్నారు...?" ఆసక్తిగ అడిగాడు రుధిర్.
"ఫస్ట్ నువ్వు చెప్పు. ఆంటీ ఏమంది..?" ఆత్రంగా అంది స్రవంతి.
"అదిగో. ముందు అలా పిలవడం మానమని చెప్పానా. అమ్మకి అస్సలు నచ్చదలా..."
"ఓక్కే..ఓకే రుధీ. అత్తయ్యా అనే పిలుస్తాను కానీ... విషయం చెప్పు. నాకు చాలా టెన్స్‌‍గ ఉంది."
"ఇందులో టెన్షన్ ఎందుకు. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ అమ్మకి చెప్పేశాను.. స్రవంతి అంటే నాకు చాలా ఇష్టం. మేం ప్రేమించుకుంటున్నాం.. అని"
"ఓహ్. ఎంత క్యూట్‌గా చెప్పావో. మళ్ళోసారి చెప్పవా ప్లీజ్.. ప్లీజ్..." నవ్వుతూ అందామె.
"అవన్నీ తర్వాత. ముందు మీ ఇంట్లో చెప్పావా..." అన్నాడు.
"అదికాదు రుధీ... చెప్పాలని చూశాను... కానీ డాడీని చూడగానే భయం వేసింది నాకు..." నసిగింది.
"డాడీ అంటే భయమయితే మీ అమ్మకి చెప్పు." సలహా ఇచ్చాడతను.
"అమ్మో వద్దులే. అమ్మలందరూ మీ అమ్మకిలా ఉండరు రుధీ. టైం చూసి, డాడీకే చెప్తాను. సరేనా.."
"ఏమో.. ఫస్ట్ మీ ఇంట్లో చెప్పి మీ వాళ్ళని మా ఇంటికి పంపించి అడిగిస్తానన్నావ్. చూసి చూసీ నేనే మా ఇంట్లో చెప్పేశాను. పోనీ మా అమ్మానాన్నల్ని తీసుకుని మీ ఇంటికి రానా..." నవ్వాడతను.
"బాబోయ్..! నువ్వంత పని చెయ్యకు రుధి. నేను మ్యానేజ్ చేసుకుంటాగా మా ఇంట్లో.." సర్దిచెప్పిందామె.
"ఛ..ఛ.. నువ్వింత పిరికిదానివనుకోలేదు.." ఉడికించాడు రుధిర్.
"నువ్వు కలవక ముందు నాకు చాలా ధైర్యం ఉండేది తెలుసా. మగపిల్లలకి ధైర్యమెక్కువుండాలని నాదంతా నీకిచ్చేశాను.."
"ఈ కథలు బానే చెప్తావు. నీ స్టోరీలు, డైరెక్షన్లు ఇక్కడ కాదు... మీ ఇంట్లో.. మీ డాడీ దగ్గర చూపించు."
"అలాగేలే. ఓయ్.. ఓయ్.. అమ్మొస్తున్నట్లుంది. పెట్టేయ్. ఉంటాను. మళ్ళీ చేస్తాలే. బై.. బై.." కంగారుగా ఫోన్ కట్ చేసేసింది స్రవంతి.
చిన్నగా నిట్టూర్చాడు రుధిర్.
అతనికి చిన్ననాటి స్రవంతి గుర్తొచ్చింది. స్రవంతి.. రుధిర్‌కి స్వంత మేనమామ కూతురు.
అప్పుడు అతనికి పదేళ్ళు కూడా ఉండవు.
చుట్టాలెవరిదో పెళ్ళి నిమిత్తం స్రవంతి వాళ్ళ ఫ్యామిలీ రుధిర్ వాళ్ళింటికి వచ్చారు. అంతా పెళ్ళి హడావుడి... సందడి... ముచ్చట్లూ... మందహాసాలే.
ఆ పెళ్ళి లోగిలిలో పెద్దల కాలక్షేపం కబుర్ల మధ్య పిల్లల ఆటలు, కేరింతలు.
రుధిర్ ఆటలో పరిగెత్తుతూ వచ్చిన వాడల్లా ఆగి, స్రవంతి బుగ్గమీద ముద్దుపెట్టాడు.
పెళ్ళి ఊసుల్లో పడ్డ అందరూ రుధిర్ చేసిన పని చూసి ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వారు.
అందరూ తనని చూసి నవ్వడం అవమానంగా అనిపించింది స్రవంతికి. కోపంగా లేచి నీళ్ళతో బుగ్గ కడుక్కొని వచ్చింది.
ఆ తర్వాత నుంచీ వారిద్దరికీ తెలీకుండానే ఒకరంటే ఒకరికి ఏహ్యత మొదలైంది. దానికి తోడు మరికొన్ని నెలల తర్వాత... ఏదో సందర్భంలో స్రవంతిని అడిగారెవరో.. ’మీ బావని చేసుకుంటావా...?’ అని. ’ఛీ. అంత నల్లోడిని ఎవరు చేసుకుంటారు’ అంది స్రవంతి దూరంగా కనిపిస్తున్న రుధిర్‌ని అసహ్యంగా చూస్తూ. ఆ మాట అతనికి స్పష్టంగా వినబడింది. పళ్ళు పటపట కొరుకుతూ స్రవంతి వంక చూశాడతను.
సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. అలా ఏదో ఒక సంఘటన, పరుషపు మాట ఈ మధ్య వరకూ ఆ దూరాన్ని పెంచుతూనే వచ్చింది.
ఏమైందో తెలీదు... నిరుడు వేసవి సెలవలకి...
తల్లిదండ్రులతో వచ్చి నెల రోజులున్న స్రవంతి చెన్నై తిరిగివెళ్తూ.. రుధిర్‌తో ’నువ్వంటే నాకు ఇష్టం. మరి నేనంటే నీకు...’ అనడిగింది.
శ్రావణి చేసిన గాయం ఇంకా రగులుతూ ఉండగానే.. స్రవంతి వైపు నుంచి ఇలాంటి ప్రపోజల్ విని బిత్తరపోయాడు రుధిర్. అప్పటికి మాత్రం ’నేను ఫోను చేస్తాలే’ అన్నాడు.
మర్నాడు_ స్రవంతికి ఫోన్ చేసి శ్రావణిని తాను మనస్ఫూర్తిగ ప్రేమించిన విషయం.. ఆమె కూడా ప్రేమించినట్టే నమ్మించి తన నుంచి ఆర్థికంగా అన్ని అవసరాలూ, సరదాలూ తీర్చుకుని ఇప్పుడు మరొక ధనవంతుని పెళ్ళిచేసుకుంటున్న వైనం మొత్తం మూడు ముక్కల్లో చెప్పాడు. చివరగా.. ’నాకు ఆడవాళ్ళ మీద ఇంట్రస్ట్ పోయింది. వాళ్ళు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేం. నమ్మలేం. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నన్ను చూస్తేనే చీదరించుకునే నువ్వు ఇప్పుడు హఠాత్తుగా ప్రేమిస్తున్నాను అంటే ఎలా నమ్మను..?’ అన్నాడు.
అనేశాక చాలా బాధ పడ్డాడు. ’నచ్చితే నచ్చావని, లేకపోతే లేదని చెప్పక అనవసర మాటలని బాధపెట్టడమెందుకు. పాపం. ఫీలయిందేమో. అయ్యిందేదో అయ్యింది... ఈ మాటతో ఇక నా జోలు రాద’నుకున్నాడు.
కానీ దానికి విరుద్ధంగా స్రవంతి రోజూ అతనికి చాట్ మెసేజెస్ పంపించసాగింది. ఫోన్లో మాట్లాడేది తక్కువే అయినా ఫోన్‌కో, మెయిల్లోనో ఏవో ఒక విశేషాలు... జోక్స్... తన కాలేజీ విషయాలు... అన్నీ చాట్ మెసేజ్‌లుగా చెప్తుండేది. అతని గురించి అడుగుతుండేది. అతను బదులివ్వకపోయినా పూటపూటకీ తనధోరణిలో తాను చాట్ మెసేజ్‌లిస్తూనే ఉండేది.
చివరికి ఒక గంట పాటూ మెసేజేం రాకపోతే రుధిర్ ఫోన్లో మెసేజ్‌ల కోసం చెక్ చేసుకునేంతగా ఆమె చాటింగ్‌కి అలవాటు పడిపోయాడు.
ఎలా ఆమె ప్రేమలో ఇంతగా మునిగిపోయాడో తరచి చూసుకుంటే తనకే అర్థం కాదిప్పుడు.
ఆమె మాటలు, జ్ఞాపకాలు, డైరెక్ట్‌‍గ వచ్చి నువ్వంటే ఇష్టమని చెప్పడం, కొత్తగా బావ అని పిలవడం.. అన్నీ తలుచుకుంటున్న రుధిర్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి.
* * *
కాలేజి నుంచి వచ్చేసరికి వరండాలోని కేన్ చెయిర్‌లో కూర్చునున్న సుమనని చూసి ఆశ్చర్యంతో "అత్తయ్యా...! ఎప్పుడొచ్చారు...? ఏంటింత హఠాత్తుగా..." కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది స్రవంతి.
’నిన్నే చెప్పాను కదా. అయినా రుధిర్ పెళ్ళి గురించి మాట్లాడడానికి పేరెంట్స్‌ని తీసుకుని వచ్చేశాడా...’ అని అనుమానంగా రుధిర్ కోసం ఇంట్లోకి చూసింది.
"వాడు, మామయ్య కూడా రాలేదు. నేనొక్కదాన్నే వచ్చాను. ఇప్పుడేమన్నా పనుందా...? ఖాళీయేనా...?" ముభావంగా అడిగింది సుమన.
"ఖాళీయే అత్తయ్యా. ఓన్లీ ఫైవ్ మినిట్స్. ఫ్రెష్ అయి వస్తాను." చెప్పి తురుక్కున ఇంట్లోకి పరిగెత్తింది.
గుండె దడదడ కొట్టుకుంటోంది స్రవంతికి. ఏదో ఉద్విగ్నత... ’రుధిర్ అత్తయ్యకి తమ విషయం నిన్ననే చెప్పేశాడు. ఈ రోజు అత్తయ్య ఒక్కదే చెన్నై వచ్చింది. ఎందుకు...? మా గురించి డాడీవాళ్ళకి చెప్పడానికి వచ్చిందా..? ఎప్పుడూ ఇక్కడికి రానిది ఏ రీజన్ లేకుండా ఇంత సడెన్‌గా వస్తుందా...?’
చల్లటి నీళ్ళతో స్నానం చేసినా ఆమె టెన్షన్ తగ్గలేదు.
ఫ్రెష్ అయ్యి, జడ అల్లుకుంటూ సుమన కూర్చున్న చోటకి వచ్చింది స్రవంతి.
"అలా బీచ్ వరకూ వెళ్ళొద్దాం.. పద స్రవంతీ." చెప్పింది సుమన కుర్చీలోంచి లేస్తూ.
"ఒక్క నిముషం అత్తయ్యా." అని లోపలకు వెళ్ళి, తల్లి రంజనితో.. "అమ్మా.. అత్తయ్యా, నేను బీచ్‌కెళ్ళి వస్తాం." చెప్పింది.
"రా అత్తయ్యా. వెళ్దాం." చిరునవ్వుతో ముందుకు నడిచింది స్రవంతి.
’బయటయితేనే స్రవంతితో వివరంగా మాట్లాడొచ్చు...’ అనుకుంటూ మేనకోడల్ని అనుసరించింది.
* * *
వేడి లేని సాయంత్రపు ఎండకి అలల్లోని నీటి మీది మెరుపు తగ్గిపోతోంది. కానీ అలల్లో అలజడి పెరగడం స్పష్టంగా తెలుస్తోంది. బహుశ సాయంత్రపు నిశ్శబ్దం వల్ల తరంగాల ఘోష మరీ ఎక్కువగా విన్పిస్తుందేమో..!
ఇద్దరూ బీచ్‌లోని ఇసుకలో చతికిలపడి పది నిముషాలవుతోంది. ఎవరూ పెదవి విప్పలేదు.
సముద్ర అలలను దాటి దూరంగా షార్క్‌లో లేక డాల్ఫిన్సో గుంపుగా వెళ్తున్నాయి. వాటన్నిటి వీపుమీద కోణంలా ఉండే భాగం ఒక రిథమ్‌లో ఎత్తుపల్లాలుగా ఊగుతూ చూడ్డానికి అద్భుతంగా ఉంది.
సంభ్రమంగా దాన్ని చూస్తూ సుమనకు చూపించింది స్రవంతి.
ఓ క్షణం వాటి వంక తదేకంగా చూసి, తను చెప్పాలనుకున్న దాన్ని ఎలా మొదలుపెట్టాలా అన్న ఆలోచనలో పడింది సుమన.
"అత్తయ్యా...! ఏంటి ఆలోచిస్తున్నారు...? ఏమన్నా అడగాలనుకుంటున్నారా...?" సుమన మౌనాన్ని చూసి తనే చొరవ చేసి అడిగింది స్రవంతి.
"రుధిర్ నిన్ను ఇష్టపడుతున్నాడని చెప్పాడు..." చాలా నిదానంగా, గంభీరంగా అంది సుమన.
అలా అంటున్నప్పుడు సుమనలోని స్థిరత్వం సముద్రపు లోతులా ఉంది. గలగలలాడే మనిషిలో ఏముందో కనిపెట్టొచ్చు. కానీ గంభీరాన్ని నింపుకున్న మానసంలో ఎన్ని, ఎలాంటి భావోద్వేగాలున్నాయో ఎవరమూ చెప్పలేం. అచ్చంగా సముద్రంలోతుల్లో దాగుండే సుడుల్లా.
"నీకు వాణ్ని పెళ్ళిచేసుకోవడం ఇష్టమేనా...?" సూటిగా అడిగిందావిడ స్రవంతిని.
తెలియని సిగ్గు తొంగిచూస్తుంటే తలని నిలువుగా ఊపింది స్రవంతి.
"కానీ.. నాకు ఇష్టం లేదు స్రవంతీ..." చెప్తూ మేనకోడలి ప్రతిస్పందన కోసం ఆమె ముఖంలోకి చూసింది.
పెళ్ళి చేసుకోవడం ఇష్టమా అని అడిగి, ఇష్టమేనని చెప్పాక... ఇప్పుడు నిర్మొహమాటంగా తనకిష్టం లేదంటున్న మేనత్తవైపు చివ్వున చూసిందామె.
"నిన్ను బాధపెట్టాలనో, నా స్వార్థం కోసమో కాదు స్రవంతీ. ముప్ఫై ఏళ్ళుగా ఎందరో తల్లుల్ని చూశాను. చూస్తున్నాను. ఇలాంటి ఒక్కో కేసు చూసినప్పుడల్లా వాళ్ళు పడుతున్న బాధ నా బాధలానే ఉండేది. కానీ... ఇంత అనుభవాన్ని సంపాదించీ అన్నీ తెలిసీ మిమ్మల్ని ఆ నరకంలో పడెయ్యలేను. అది మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు స్రవంతీ..." ఉద్వేగంగా అంది సుమన.
"అత్తయ్యా..! మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకర్థం కావట్లేదు. ప్లీజ్... ఏమైంది..? నరకమేంటి...? మంచి డాక్టర్‌గా మీరంటే నాకెంతో అభిమానం. మీరేం చెప్పినా నేనర్థం చేసుకోగలను. మీ అనుభవం మాకు వరం. మీరేం చెప్పదలుచుకున్నారో విపులంగా చెప్పండి.." మనసుని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది స్రవంతి.
"నేను చదివిన జర్నల్స్‌‍లోని రీసెర్చ్‌‍ల వల్లో... నేను చేసిన డెలీవరీల్లోని రియల్‌నెస్స్ వల్లో ఒక నిజం మాత్రం తెలుసుకున్నాను..." సందిగ్థంగా ఆగింది సుమన.
"ఏమిటత్తయ్యా అది...?" కుతూహలంగా అడిగింది స్రవంతి.
"మేనరికాల వల్ల పుట్టే పిల్లల్లో ఫిజికల్లీ అండ్ మెంటల్లీ లోపాలుంటాయని. ఇది నా అనుభవం చెప్పిన నిజం."
"..... .... ....."
"స్రవంతీ. నీకు పరిస్థితిని అర్థం చేసుకోగల వయసు, మెచ్యూరిటీ వచ్చాయని అనుకుంటున్నాను. నేను చెప్పేది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించు. మేనరికాలు చేసుకున్న ఎన్నో డెలివరీ కేసుల్లో చూశాను. పిల్లలు అవిటి వారిగా, అంగ వైకల్యంతో, అంథత్వంతో పుట్టడం. అది కూడా బాధనిపించదు స్రవంతీ. కానీ ఆ తర్వాతే... ఆ పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోలేక, వాళ్ళు పడే బాధని చూస్తూ కూడా ఏమీ చెయ్యలేక వాళ్ళున్నంత కాలం బాధ పడాల్సిందే. పదిహేనేళ్ళ క్రితం కష్టమైన కాన్పుని ఈ చేతుల్తో డెలివరీ చేశాను. తల్లీ పిల్లా క్షేమమే. వాళ్ళు సంతోషంగా ఆ పాపకి సుమ అని నా పేరే పెట్టారు..." చెప్తున్న సుమన గొంతు బరువుగా మారడం ఆవిడ మాటల వల్ల తెలుస్తోంది స్రవంతికి.
ఆవిడ ముఖంలోకి చూసింది.
సుమన కళ్ళలో పల్చటి నీటి తెర...
"సుమ పెద్దవుతుంటే గానీ తెలియలేదు. దానికి ఎదుగుతోంది శరీరమే. మెదడు కాదు. ఇప్పుడు పదిహేనేళ్ళు. కానీ... మనం చెప్పేది ఏదీ అర్థమవదు దానికి. రంగూ రూపంలో ఎవరికీ తీసిపోదు. పాలరాతి శిల్పంలా ఉంటుంది. కానీ... ఇన్నేళ్ళొచ్చినా ఏమీ తెలీదు.. శిల్పంలాగే. మాటలు రాలేదు. ఏదన్నా చెప్తుంటే వినినట్టే ఉంటుంది. వింటూ ఒక్కసారిగా నవ్వుతుంది. లేదా లేచి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ బట్టల్లోనే, పక్కమీదే అన్నీ. ఒక్కోసారి చిరాకనిపిస్తే ఒంటి మీద బట్టలూ ఉంచుకోదు. మగపిల్లాడైతే పర్లేదు స్రవంతీ. అది ఆడపిల్ల. మెన్సెస్ మొదలై సంవత్సరమైంది. అదీ తెలీదు దానికి. ప్రతీ సెకనూ దాని వెనకే ఉండి చెయ్యాలి. ఒక్క నిముషం ఆదమరిస్తే... ఏమవుతుందోనన్న భయం. వాళ్ళని పెంచలేక ఒక్కోసారి జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అలాగని. కన్నదాన్ని వదిలెయ్యలేంగా. సుమ ఒక్కదే కాదు ఇలా ఎన్నో కేసుల్లో. అబ్‌నార్మల్‌గా పుట్టిన ప్రతీ బిడ్డ తల్లిదండ్రుల్నీ వివరాలు అడిగేదాన్ని. వాటిలో నైన్టీ పర్సెంట్ మేనరికాలే." ఒక్క క్షణం ఆపింది సుమన.
"స్రవంతీ..! నువ్వు నమ్ముతావో నమ్మవో... నాకు నిన్ను కోడలిగా చేసుకోవాలని నీ చిన్నప్పటుంచే ఉండేది. కానీ ఇన్ని సాక్ష్యాల్ని చూశాక ఆ కోరిక నిజమవకూడదని ఆశించేదాన్ని. విరుద్ధమైన రెండు కోరికల్తో ఇన్నాళ్ళూ నాలో నేనే మధనపడ్డాను. నేను ఏదైతే జరగకూడాదనుకున్నానో అదే జరిగేలా ఉంది. అందుకే మీ అభిప్రాయం, ఇష్టం సరిఅయినవి కావని చెప్పడానికి, మీ ఆశల్ని మొదట్లోనే మళ్ళించడానికీ నేను ఇంత సడెన్‌గా వచ్చాను. ఒక్క మాట చెప్పనా స్రవంతీ... కడుపుతీపి, అమ్మతనం వరం అవ్వాలి గానీ శాపం అవ్వకూడదు" ఆలోచనలో పడిన స్రవంతి వంక వాత్సల్యంగా చూసింది సుమన.
"అత్తయ్యా...! మిమ్మల్నో ప్రశ్న అడగుతాను. నాకు నిజం చెప్పండి..."
"అడుగు స్రవంతీ..."
"బావ, నేను పెళ్ళిచేసుకుంటే పిల్లలు అబ్‌నార్మల్‌గా పుడతారు.. వాళ్ళనలా చూస్తూ జీవితాంతం బాధ పడలేం అన్నదే కదా మీ బాధ...?"
తలూపింది సుమన.
"ఒకవేళ నేను బావని కాక బయటి వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే నాకు పుట్టే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ అబ్‌నార్మల్‌గా ఉండరు అని మీరు మాటివ్వగలరా...? మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ చిల్డ్రన్ని మేనరికాల్లో మాత్రమే చూశారా మీరు...? బయటి కేసుల్లో ఒక్కటి కూడా ఉండదా...?"
"అలా అని లేదు స్రవంతీ. ఏ సంబంధమూ లేని భార్యాభర్తల పిల్లల్లోనూ ఇలా అబ్‌నార్మల్‌గా పుట్టే అవకాశాలున్నయి. కానీ మేనరికాల వల్ల ఆ చాన్స్ తొంభై శాతం ఎక్కువ. వాటిలో మనదీ ఒకటి కాకూడదనే నా బాధ."
"అత్తయ్యా...! మీరు చెప్పినట్టే ఎవర్నో చేసుకున్నాక అప్పుడూ నాకు అలాంటి పిల్లలే పుడితే ఇక నా జీవితానికి అర్థమేంటి..? ఇటు కోరుకున్న బావనీ పోగొట్టుకుని... అటు అలా జరిగితే ఇక నేను బతకడమెందుకు...?" అప్రయత్నంగా దు:ఖం పొంగుకొచ్చింది స్రవంతికి.
బయటికే ఏడ్చేస్తున్న స్రవంతిని చూసి ఆమె ఎంత హర్టయిందో అర్థమై ఓదార్పుగ స్రవంతి భుజంచుట్టూ చెయ్యి వేసింది సుమన.
"అత్తయ్యా... మీ భయం అదే అయితే మాకు పిల్లలు వద్దత్తయ్యా." వెక్కిళ్ళ మధ్య అందామె.
"యూ స్టుపిడ్. ఏంటా మాటలు. పిల్లలు లేకుండా ఎలా..? రెండిళ్ళలోనూ ఒక్కొక్కరే. మీరే పిల్లల్ని వద్దనుకుంటే ఎలా..? అయినా నిన్న మొన్నటివరకూ తిట్టుకునేవాళ్ళు... నీకు వాడంటే అంత ఇష్టమెందుకే...?"
"నీకు బావ గురించి తెలీదత్తయ్యా. ఇది వరకు నవ్వుతూ, నన్ను ఏడిపిస్తూ, తిడుతూ ఎంత సరదాగా ఉండేవాడు.. అలాంటిది ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు..."
"పెద్దయ్యేకొద్దీ మనస్తత్వం మారదా. చిన్నప్పటి అల్లరి అలాగే ఉండిపోతుందా... పిచ్చిపిల్లా..."
"కాదత్తయ్యా. బావని నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చెయ్యలేదు.."
’తను ప్రాణంగా చూసుకునే కొడుకులో తనకు తెలీని కోణమా..’ ఆశ్చర్యంగా స్రవంతివంక చూసింది సుమన.
"బావ శ్రావణి అనే అమ్మాయిని ప్రేమించాడు అత్తయ్యా."
తన పక్కన బాంబు పడినంత షాకింగ్‌గా చూసిందామె.
"వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ శ్రావణి... ’తన మంచి కోరేవాడివైతే తనని మర్చిపో’ అనిచెప్పి పెద్ద బట్టల వ్యాపారస్తుడ్ని పెళ్ళి చేసుకుంది."
"ఈ విషయం నీకెలా తెలుసు...?"
"లాస్ట్ ఇయర్ మీ ఇంటికొచ్చినప్పుడు బావలో ఏదో మార్పు...! ఒక్కడే... ముభావంగా ఉండేవాడు. చిన్నప్పట్నుంచి నాకు తెలిసీ బావ మనస్తత్వం అది కాదు. ఏదో జరిగింది. అక్కడున్న నెల రోజుల్లో రుధీ బాధ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఏదో ఒకటి చేసి రుధీని మళ్ళీ మామూలుగా చూడాలనుకున్నాను. అందుకే వచ్చేటప్పుడు వాడంటే ఇష్టమని చెప్పాను. అప్పుడు చెప్పాడు అసలు సంగతి. ఆ తర్వాత రుధీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా శ్రావణి గూర్చి పూర్తిగా తెలిసింది."
’నేను వాడి కన్నతల్లినే కదా. వాడిగురించి నాకెందుకు తెలీలేదు...’ విశ్లేషించుకోసాగింది సుమన.
"అత్తయ్యా. సమ్మర్ హాలిడేస్‌కి అక్కడికొస్తానా... బావతో గొడవపడుతూ ఎంత జాలీగా గడిచిపోతాయో రోజులన్నీ. రుధీకి ప్రేమించడమే తెలుసత్తయ్యా. అందుకే నేను రుధీని వదులుకోలేను... నీకు ఇష్టం లేకపోయినాసరే.." చివరి మాటలు నిదానంగా చెప్పింది స్రవంతి.
’అమ్మతనం అపురూపమైంది అద్భుతమైంది అనుకున్నాను... కానీ నా కన్నప్రేమ కంటే స్రవంతీలోని కన్నెప్రేమ చాలా గొప్పది. అమ్మతనాన్నే కాదనుకుంటోంది. దానికి పిల్లలు లేకపోయినా రుధిర్‌ని నాకంటే మిన్నగా చూసుకోగలదు... దాన్ని మించిన అమ్మతనం ఇంకేముంటుంది. ఏం జరిగినా భారం విధి మీద పడేసి నిశ్చింతగా ఉండాలి...’ మనసులో అనుకుంటూ రిలీఫ్‌గా ఊపిరిపీల్చుకుంది సుమన.
"పద వెళ్దాం. చాలా టైమైంది. అమ్మ ఎదురు చూస్తుంటుందేమో.." తను లేచి మేనకోడలికి చేయందించింది.
ఆ ఆసరా తన భవిష్యత్తుకి కూడా అని అర్థమై స్రవంతి అపనమ్మకంగా, ఆనందంగా అత్తవంక చూసింది.
సుమన కళ్ళలో కన్నబిడ్డని చూస్తున్నంత మమకారం..